AP 8TH Class Telugu Andhra Vaibhavam Rhyme
పాడరా ఓ తెలుగువాడా! పాడరా ఓ కలిమి రేడా!
పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్యగీతము
చ॥ యుగయుగమ్ములనుండి బంగరు గంగనిచ్చెడు గౌతమీ నది,
కోహినూరును కురులసందున ముడిచి కులికిన కృష్ణవేణి,
హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్రా
సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి ॥ పా॥ 1
చ॥ పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు,
ఆడుచును మన తెలుగుజెండా పరువునిలిపిన మేలి ఘటనలు,
పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగ,
సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడలవేగ మనమిక
కదనరంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజము,
వదరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధపటిమ,
కొదమసింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము,
పొంగజేయద మేనిరక్తం? ఉప్పొంగ జేయద నీదు హృదయము
తెలుగు పలుకులు తేనె లొలికెను తిక్కనార్యుని కవితలోనా,
రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగె తెనుగూ,
సొంపుగూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద,
భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము
తెలుగుజాతికి నూత్న సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి,
తెనుగుభాషను ప్రజల భాషగ చేయ పోరిన గిడుగు పిడుగూ,
దేశమంటే మనుజులేనని చాటిజెప్పిన అప్పారాయడు,
తెనుగుతల్లీ నోము పంటగ తేజరిల్లిన దివ్య తారలు
కలవు గనులు, నదులు జలములు, పసిడి పంటలు, వెల్లివిరియు,
సిరియు సంపద, వెల్లివిరసెడి స్వర్గతుల్యము చేసికుందము,
ఆరుకోటుల తెలుగు బిడ్డల ముక్తకంఠము లొక్కపెట్టున,
జయము జయమని తెలుగుతల్లికి విజయగీతిక లాలపించగ