famous-person-Nandamuri-Tharaka-Ramarao-NTR-biography-history

famous-person-Nandamuri-Tharaka-Ramarao-NTR-biography-history

NANDAMURI THARAKA RAMARAO (NTR)

ఎన్టీయార్ – ఆ మూడు అక్షరాలలోనూ ఒక పవర్ తెచ్చి పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తి, నటుడు అంతకుముందుదాకా తెలుగుతెరపై ఉద్భవించలేదు. ఇప్పట్లో ఉద్భవిస్తాడన్న ఆశ కూడా లేదు. రామారావుగారు పోయినప్పుడు వచ్చిన జనం చూస్తే మతి పోతుంది.  ఏ రాజకీయ నాయకుడికీ అంత జనం రారు. ఏ నటుడికీ అంత జనం రారు. మహా నటుడు, ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు వీళ్లిద్దరకూ కలిపి రావలసిన జనం కంటె ఎక్కువమంది వచ్చారు. ఆ ఎక్కువ ఎందుకు వచ్చారంటే, అదీ ఆయన పర్శనాలిటీ! 

ఎన్టీయార్ ఎంతో పెట్టిపుట్టిన వ్యక్తి. మహర్జాతకుడు. ఆయనకు 5 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం ముందు వల్లూరు వెంకన్న పంతులు గారి వద్దకు తీసుకెళితే, ఆయన దానికి ముందు పాద సాముద్రికం చూడాలంటూ పళ్లెంలో బియ్యప్పిండి పోయించి, పిల్లవాణ్ని నిల్చోమన్నారు. పాదముద్రలు చూస్తే అరికాళ్లల్లో శంఖుచక్రాలు ఉన్నట్లు కనబడింది. ‘వీడు దైవాంశ సంభూతుడు, మహర్జాతకుడు’ అని డిక్లేర్ చేశారాయన. 

ఆయన వేసిన పాత్రలు ప్లస్ సమ్థింగ్ వుంది ఆయనలో. అదే జనాలను ఆకట్టుకుంది. ఎన్టీయార్ సినీరంగ ప్రవేశం ‘మనదేశం’ సినిమాతో జరిగింది. అది 1949. అంటే అప్పటికి ఆయనకు 26 యేళ్లు.  అంటే నాగేశ్వరరావుగారి కంటె ఏడాదిన్నర పెద్దయినా ఎనిమిదేళ్లు  వెనుకగా సినీరంగంలో ప్రవేశించారన్నమాట. 1941 ధర్మపత్ని అక్కినేని మొదటి సినిమా.  ఎనిమిది ఏళ్ళు వెనకాల వచ్చినా అతి త్వరలో ఎన్టీయార్ నాగేశ్వరరావుగారికి పోటీగా మారారు. 

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

సీనియర్, అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాగేశ్వరరావుకి నిద్రపట్టకుండా చేసిన రామారావు అర్హతలేమిటి? మంచి రూపం, మంచి శరీర సౌష్టవం, మంచి వాచికం, మంచి చదువు, మంచి నేపథ్యం.. అన్నీ మంచిలే! ఎన్నో లోపాలు అధిగమిస్తూ నాగేశ్వరరావు తన ప్రస్థానం సాగించారు. రామారావుకి ఆ బాధలు లేవు. హీ ఈజ్ ఏ బోర్న్ హీరో! నేచురల్గా ఆయన టాలెంటుకు వెనువెంటనే గుర్తింపు వచ్చింది. వస్తూ వస్తూనే ఆయన హీరో అయిపోయారు. ‘అంటే ‘మనదేశం’లో హీరో నారాయణరావు. ఈయనది చిన్న ఇన్స్పెక్టర్ వేషం. ఎల్వీ ప్రసాద్గారితో మొహమాటం కొద్దీ వేయాల్సి వచ్చింది. దానికంటె ముందు బుక్ అయినది, రిలీజవ్వాల్సినది అయిన ‘పల్లెటూరి పిల్ల’లో ఈయనది హీరో వేషం. అది లెక్కలో తీసుకుని మొదటి సినిమా నుండే హీరో .

ఎన్ టి ఆర్ గుంటూరులో ఎసి కాలేజీలో బిఏ చదివే రోజుల్లోనే సినిమా ఆఫర్లు వచ్చాయి. బిఏ పూర్తవందే సినిమాల్లో చేరే ఉద్దేశం లేదన్నారు.  అప్పటికే జగ్గయ్య, ముక్కామల వీళ్లందరితో కలిసి నాటకాలు వేసేవారు. ఈయన వేసిన ఓ నాటకం చూసి సినీనటి శ్రీరంజని భర్త సి.పుల్లయ్యగారికి పరిచయం చేశారు. పుల్లయ్యగారు ‘కీలుగుర్రం’ తీసే ప్రయత్నాల్లో వున్నారు. అందులో రాకుమారుడి పాత్రకు ఈయన బాగుంటారని అనుకున్నారు పుల్లయ్యగారు. అడ్రసు తీసుకున్నారు. మద్రాసు వెళ్లాక ఆయన ఐడియా మారింది. ”కీలుగుర్రం’ కాదు, ‘వింధ్యరాణి’లో వేషం యిస్తాం, రా’ అన్నారు. ఈయన చదువు వదిలి రానన్నారు. 

ఎన్ టి ఆర్ 1923 మే 28న నిమ్మకూరులో పుట్టారు. అది చాలా కుగ్రామం. ఏ విధమైన సౌకర్యమూ లేదు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రామమ్మలకు ఆలస్యంగా పుట్టిన సంతానం, ఇతను పుట్టిన 4 ఏళ్లకు తమ్ముడు పుట్టాడు. తాత రామస్వామి చౌదరికి 80 ఎకరాలుండేవి. లక్ష్మయ్య చౌదరిగారికి యిద్దరు అన్నలు, ఒక తమ్ముడు. తలా 20 ఎకరాలు వచ్చాయి. 5 కి.మీ.ల దూరంలో ఉన్న నిడుమోలు గ్రామవాసి వల్లూరి సుబ్బయ్య పంతులు అనే ఆయన వద్ద ఎన్ టి ఆర్ 1,2,3 క్లాసులు చదవడం జరిగింది. 4,5 తరగతులు అవురుపూడి మునసబు గారింట్లో నడుస్తున్న ఇంగ్లీషు బడిలో చదివించారు. 

ఎన్ టి ఆర్ పెద నాన్న  రామయ్య గారు దంపతులు విజయవాడకు మకాం మార్చి  ఎన్ టి ఆర్ ను తమ దగ్గరే పెట్టుకుని 1933లో విజయవాడ గాంధీ మునిసిపల్ హైస్కూల్లో హైస్కూలు చదువు చదివించారు. దానితో బాటు రామయ్య గారు యితన్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని విజయవాడలోని దుర్గా కళామందిర్కు తీసుకుని వచ్చి నాటకాలు చూపించేవారు. బందా, స్థానం, వేమూరి వగైరాలు నటించేవారు, అవి చూసి యితనికి నాటకాలపై ఇంట్రస్టు కలిగింది. ఎస్సెల్సీ టైములోనే పుండరీ కాక్షయ్య, సుంకర కనకారావు వగైరాలు పరిచయమయ్యారు.

1940లో ఎస్సెల్సీ పూర్తయ్యేసరికి రామయ్య గారి ఆస్తి కరిగిపోయింది. ఇంకో నాలుగైదేళ్లకు పోయారు కూడా. ఈలోగా  ఎన్ టి ఆర్  తండ్రి ఆస్తి పోగొట్టుకుని,  పొలమంతా అమ్మేసి, విజయవాడకు కాపురం మార్చారు. తండ్రి 4 గేదెలు కొని పాల వ్యాపారం మొదలెట్టారు. హీరో సైకిలు మీద యిళ్లకు పాలు పోసి కాలేజీకి వెళ్లేవారు ఎన్ టి ఆర్.  నిజానికి యితను చిన్నప్పణ్నుంచి కష్టానికి వెరవలేదు. సెలవుల్లో యింటికి వెళ్లినపుడు కాలవ నుంచి 40 కావిళ్ల నీళ్లు గంటలో తోడి యింటికి తెచ్చేవారు. 

ఎస్సెల్సీ తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటరు లో చేరారు ఎన్ టి ఆర్. విశ్వనాథ సత్యనారాయణ గారు లెక్చరరు. కాలేజీలోనే కెవిఎస్ శర్మ (తర్వాతి కాలంలో సినిమా నటుడు) పరిచయమయ్యారు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అనే సినీ నటుడు (‘భక్త పోతన’, ‘పెద్దమనుష్యులు’ వగైరా సినిమాల్లో వేశారు) యితనిపై అభిమానంతో రిక్షాలో కూర్చోపెట్టుకుని తిప్పుతూ సినిమా కబుర్లు చెప్పేవారు.  

ఇంటరు చదువుతూండగానే జరిగిన పెళ్లి జరిగింది. బసవతారకం గారు యితని తల్లి కజిన్ బ్రదర్ కూతురు. ఆమెను చేసుకోవాలని పెద నాన్న రామయ్య పట్టుదల. మరో పక్క యితని పినతండ్రి తన బావగారి కూతురినిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించారు. తల్లి వైపు బంధువులా, తండ్రి వైపు బంధువులా ఎవరి వైపు మొగ్గాలన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. చివరకు యితని తలిదండ్రులు పెళ్లికి రాలేదు. పెద నాన్న రామయ్యే దగ్గరుండి జరిపించారు. ఎన్టీయార్ సినిమా ఫీల్డులో నిలదొక్కుకున్నాక పోయిన ఆస్తులన్నీ సాధించారు. 

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

1942లో ఇంటర్ చదువు పూర్తయింది. పెళ్లి వలనో, నాటకాల వలనో ఇంటర్ రెండుసార్లు ఫెయిలయి 1945 వరకు పాస్ కాలేదు. (పెద నాన్న  రామయ్య పోయినది యీ టైములోనే) ఈ మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. మిలటరీ లేదా పోలీసు ఉద్యోగం చేద్దామనుకున్నారు. బంధువొకాయన మద్రాసు పచ్చయప్ప కాలేజీలో లెక్చరరుగా వున్న ఎన్జీ రంగా వద్దకు తీసుకెళ్లి సిఫార్సు చేశారు.  ఆయన ‘నీకెందుకు ఉద్యోగం? పోయి వ్యవసాయం చేసుకో’ అన్నారు. ఇంటికి తిరిగి వచ్చి ఖాళీగా వున్నారు. బియ్యే చదవాలంటే విజయవాడలో ఆ సౌకర్యం లేదు, గుంటూరుకి వెళ్లాలి. 

అప్పట్లో ఉద్యోగాలకైనా, సినిమాల కైనా బొంబాయి వెళ్లాల్సిందే. జనతా ఫోటో స్టూడియో కోటేశ్వరరావు అనే ఆయన్ని వెంటపెట్టుకుని బొంబాయి సినీరంగంలో చేరదామని వెళ్లారు. అక్కడ ఎడిటింగు విభాగంలోనో, సౌండ్ రికార్డింగు లోనో  చేరమన్నారు.  వద్దులే అనుకుని మిలటరీ వైపు చూశారు. రెండవ ప్రపంచయుద్ధంలో వార్ పోస్టల్ డెలివరీకై గ్లయిడర్లు నడిపేవారు. వాటికి పైలట్లగా పని చేయడానికి ఎమెచ్యూర్స్ను తీసుకుని 15 రోజుల శిక్షణ యిచ్చి గ్లయిడర్ ఎక్కమనేవారు. ఈయన 3 నెలల కోర్సులో చేరి, గ్లయిడర్లను నమ్మడానికి లేదని దానిలో చేరలేదు. తర్వాత బొంబాయిలో మాతుంగాలో ఆంధ్రా మెస్ నడిపారు. చివరకు ప్రాణం విసిగి, తండ్రి వెనక్కి వచ్చేయమంటే జనతా కోటేశ్వరరావుతో సహా వెనక్కి ఊరికి వచ్చేశారు. 

అక్కణ్నుంచి విజయవాడలో పాల వ్యాపారం చేశారు. సైకిల్మీద వెళ్లి హోటళ్లకు పాలు పోసేవారు. పొగాకు వ్యాపారం పెట్టారు. రెండేళ్లపాటు యిలా కష్టపడ్డారు. బంధువులంతా హేళన చేశారు. ‘మీ పెదనాన్న నిన్ను తన దగ్గర వుంచుకుని పెంచాడు. పెద్ద చదువులు చదువుతావనీ, ఆఫీసరు అవుతావనీ కలలు కన్నాడు. ఆయన పోయాడు. నువ్వు చూస్తే యిలా వున్నావ్’ అన్నారు. బంధువులు హేళన చేయడంతో ఎన్టీయార్కు పట్టుదల వచ్చింది. రెండేళ్ల విరామం తర్వాత 1945లో బియేలో చేరారు. కష్టపడి చదివారు. ఆ టైములోనే ఇందాకా చెప్పిన సినిమా ఆఫర్ వస్తే వద్దన్నారు. తనను పెంచిన పెదనాన్నకు ఆత్మశాంతి లభించాలంటే బియే పూర్తవాల్సిందేనన్నారు. 

1945 నుంచి 1947 వరకు కాలేజీలో బియ్యే చదివే రోజుల్లో ఎన్టీయార్ గుంటూరు నుంచి రైల్లో విజయవాడ వెళ్లేవారు. బండి తప్పిపోతే రైలు పట్టాల మీద నడుచుకుంటూ విజయవాడ వెళ్లిన సందర్భాలున్నాయి. అప్పుడు భార్య హరికేన్ లాంతరు పట్టుకుని యింటి దగ్గర వెయిట్ చేసేవారు. 1947లో ఎల్వీ ప్రసాద్గారు ‘శ్రీమతి’ అనే సినిమా ప్లాను చేస్తున్నారు – అల్టిమేట్ గా తీయలేదు  – విజయవాడ వస్తే రామారావుగార్ని ఎవరో పరిచయం చేశారు. సినిమాల్లో వేస్తావా అంటే గ్రాజువేషన్ అయిపోయింది కాబట్టి సరేనన్నారు. ఆయన మద్రాసుకి రమ్మన్నారు. స్క్రీన్టెస్ట్లు చేయించారు. మళ్లీ పిలుస్తాం ప్రస్తుతానికి వెళ్లమన్నారు.

ఈయన వెనక్కి వచ్చి నేషనల్ ఆర్ట్ థియేటర్ పేర నాటకాలు వేస్తూండేవారు. తర్వాత సినిమా నిర్మాణం ఎన్.ఏ.టి. పేర చేసేవారు , దాని ఫుల్ ఫామే – నేషనల్ ఆర్ట్ థియేటర్. ఉద్యోగాలకై ప్రయత్నాలు కూడా చేస్తూండేవారు. సర్వీస్ కమీషన్కి పరీక్ష రాస్తే సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. జాబ్లో చేరుదామా లేదా అనుకుంటూండగానే జాబు వచ్చింది ఎల్వీ ప్రసాద్గారి వద్దనుండి.  ‘శ్రీమతి ఆగిపోయింది, ‘మనదేశం’ తీస్తున్నాను. అందులో చిన్నవేషం వుంది. వచ్చి వేయండి’ అని. ‘హీరో అని చెప్పి చివరికి చిన్నవేషం వేయడమేమిటి?’ అనుకుని ఈయన సినిమా ఆశ వదిలేసి ఉద్యోగంలో చేరారు. చేరాడే కానీ ఈయన దానిలో పని చేసినది 11 రోజులు మాత్రమే! దానికో కారణం వుంది.

ఎన్టీయార్ది చిన్నప్పటినుండీ కష్టపడి పనిచేసే రైతు కుటుంబం. ఈయన చేరినదేమో అవినీతికి ఆలవాలమైన రిజిస్ట్రార్ ఆఫీసు. ఆఫీసులో చేరిన మొదటిరోజున ఈయన కోటు విప్పి కుర్చీకి తగిలించి పని చేసుకున్నారు.  సాయంత్రానికి కోటు జేబు బరువుగా వుందట. చూస్తే లంచం డబ్బు! ఆఫీసు బంట్రోతు ఆరోజు ట్రాన్సాక్షన్స్లో ప్రతి వాడి వాటా కోటులో పడేసి వెళ్లేవాడు. ఇది చూడగానే ఈయన గంగవెర్రులెత్తిపోయారు. నాకు వద్దు పొమ్మన్నారు. దెబ్బకి ఆఫీసులో కొలీగ్స్ అందరికీ శత్రువై పోయారు. ఇలాటివాడు తమ మధ్య వుంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నారు. ఇలాటి హోస్టయిల్ వాతావరణం ఆయనకు పడలేదు. పైగా ఓ కొలీగ్ ‘మేమందరం ధైర్యం చేయలేక ఇక్కడే పడి కొట్టుకుంటున్నాం. నీకు రూపం వుంది, సాహసం వుంది. సినిమా రంగానికి వెళ్లు’ అని నూరిపోశారు.

అలా ఎందుకన్నారంటే అప్పుడే ఎన్టీయార్కి బిఏ సుబ్బారావు గారి వద్దనుండి ఉత్తరం వచ్చింది. ఆయన అప్పుడే పైకి వస్తున్న  దర్శకుడు. ‘పల్లెటూరి పిల్ల’ సినిమా ప్లాను చేస్తూ ఎల్వీ ప్రసాద్గార్ని సలహా అడిగారు. ఆయనేమో ఈయన్ని రికమెండ్ చేశారు. ‘మద్రాసు రండి’ అని బియే సుబ్బారావు ఉత్తరం రాశారు. చివరకి కొలీగ్ సలహా విని ఎన్టీయార్ మద్రాసు రైలెక్కారు. మద్రాసు వెళుతూనే ఎల్వీ ప్రసాద్ దగ్గరకు వెళ్లి ‘నాకు హీరో వేషం యివ్వలేదేం? నేను దానికి తగనా?’ అని నేరుగా అడిగేశారు. అదీ ఆయన స్టయిల్. జీవితమంతా ఆయన సమస్యలను ఎదుర్కోవడంలో అదే స్టయిల్ పాటించారు. దాపరికం లేదు. డైరక్టుగా తలపడడమే! ప్రసాద్గారు ‘కాలం కలిసిరాలేదు. ఈలోపున సుబ్బారావుగార్ని కలవండి’ అన్నారు.

ఈయన స్టూడియోకి వెళ్లి సుబ్బారావుగార్ని కలిశారు. ఎన్టీయార్ని వస్తూండగానే దూరం నుండి చూసి సుబ్బారావు గారు ‘ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను’ అనుకున్నారు. ఈయన దగ్గరకు వెళ్లి ‘నేను ఫలానా’ అనగానే ‘అయితే నువ్వే నా హీరోవి’ అన్నారు. మేకప్ టెస్ట్ లేదు, వాయిస్ టెస్టు లేదు, ఏమీ లేదు. వెయ్యినూట పదహార్లు అడ్వాన్సు యిచ్చి బుక్ చేసేసుకున్నారు. ఎల్వీ ప్రసాద్ మొత్తుకున్నారు. చాలా రిస్కు తీసుకుంటున్నావని హెచ్చరించారు. ‘పోనీ నా ‘మనదేశం’లో చిన్న వేషం యిచ్చి చూస్తా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది’ అన్నారు. సుబ్బారావు గారు వింటేగా? అబ్బే అదేం అక్కరలేదు అన్నారు. కానీ ఎల్వీ ప్రసాద్గారు ఎన్టీయార్కి మనదేశంలో చిన్న వేషం యిచ్చారు. అదీ విలనిక్ వేషం. దేశభక్తులపై విరుచుకుపడే పోలీస్ ఇన్స్పెక్టర్ వేషం. తొలివేషం హీరోకాదే అనుకుంటూనే ఎల్వీ ప్రసాద్గారి మీద గౌరవం కొద్దీ ఎన్టీయార్ వేషం ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఆయన పాత్రలో జీవించేశారు.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

పాత్రలో జీవించడం అనేది మామూలుగా చాలామంది విషయంలో అనేస్తాం కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎన్టీయార్ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. అది మొదటి సినిమాలోనే తెలిసింది. ఆయనది ఇన్స్పెక్టర్ వేషం. స్వాతంత్య్రవీరులపై లాఠీచార్జి చేయడం సీను. జూనియర్ ఆర్టిస్టులను కొంతమందిని తీసుకువచ్చి ‘వీళ్లు స్వాతంత్య్ర యోధులు’ అన్నారు. ‘యాక్షన్’ అనగానే ఈయన వాళ్ల మీద పడ్డారు. నిజంగానే చితక్కొట్టేశారు. వాళ్లు బాబోయ్ బాబోయ్ అన్నా వినలేదు. తరిమి తరిమి కొట్టారు.

వాళ్లు బెదిరిపోయి స్టూడియో గేటు దాకా పారిపోయినా ఈయన వెంట పడి మరీ కొట్టారు. డైరక్టరుగారు తిట్టిపోశారు – ఏమిటయ్యా నిజంగానే కొట్టావ్! అని. ‘పోలీసులు నిజంగానే కొడతారు కదా సార్’ అని ఈయన జవాబు. జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి ప్రతాపం చూపించారు, అదే తనైతేనా? అని అనుకోవద్దు. ‘పల్లెటూరి పిల్ల’లో హీరో , అందులో అంజలిచేత చెంపదెబ్బ తినే సీను వుంది.  ఆవిడ లాగి కొట్టినా డైరక్టరుగారు టేకు ఓకే చేయలేదు. మళ్లీ, మళ్లీ… తొమ్మిదిసార్లు కొడితే తప్ప టేకు ఓకే కాలేదు. మధ్యలో ఆవిడ ‘కొత్తబ్బాయండి, పాపం’ అన్నా ఎన్టీయార్ ‘ఏం ఫర్వాలే, కొట్టండి’ అని ఎంకరేజ్ చేశారు. చివరికి చెంప ఎర్రగా కందిపోయింది.

‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో కోడె దూడతో పోట్లాడే దృశ్యం వుంది. డూప్ను పెడతానంటే వద్దని ఈయనే రంగంలోకి దిగారు. ఎద్దు చూడబోతే బలిష్టమైన ఆస్ట్రేలియా గిత్త! శుబ్బరంగా ఎన్టీయార్ను ఎత్తి కుదేసింది. దెబ్బకి ఈయన కుడిచేతి మణికట్టు విరిగింది. ఆసుపత్రిలో కొన్నివారాలుండి చివరకు పుత్తూరు వైద్యంతో బాగు చేయించుకున్నారు. మళ్లీ కొన్నిరోజులకు తెల్లవారు ఝామున షూటింగ్ అయి నిర్మాత కారులో యింటికి వస్తూ వుంటే యాక్సిడెంటు అయి ఆ చేతికే దెబ్బ తగిలింది మళ్లీ. కట్టు కనబడకుండా ఫుల్హేండ్ చొక్కా వేసుకుని యాక్ట్ చేసేశారాయన.

ఇదంతా తొలిరోజుల మోజు అనుకోలేము. చివరిదాకా అలాగే వున్నారాయన. స్టంటు సినిమాల్లో నిజంగానే పోట్లాడేవారు. విలన్లను పట్టుకు చావగొట్టేవారు, వాళ్ల చేతిలో దెబ్బలు తినేవారు. గులేబకావళి సినిమాలో పొట్టి కత్తులతో పోట్లాడినప్పుడు గీరుకు పోయేవి. ‘కృష్ణావతారం’ సినిమా గురించి ఓ సంఘటన చెప్తారు. రాయబారం సీనులో ‘యుద్ధమంటూ జరిగితే భీమసేనుడు నీ తొడలు విరక్కొడతాడు చూసుకో’ అంటూ దుర్యోధనుణ్ని హెచ్చరిస్తూ పద్యం పాడే సీనులో ఎఫెక్టు కోసం చేతిలో వేణువు తొడమీద కొట్టుకుంటూ పద్యం పాడారు ఎన్టీయార్. అయితే అది మామూలు చెక్క ఫ్లూటు కాదు. స్టీలుది. కొన్ని టేకులు తీసుకుని మొత్తంమీద సీను ఓకే చేయించుకుని మేకప్ తీసేసి బట్టలు మార్చుకుంటూ వుంటే అప్పుడు కనబడ్డాయి తొడమీద ఫ్లూట్ గీతలు. ఎర్రగా రక్తం గడ్డకట్టేట్టు కొట్టేసుకున్నారాయన. అది తెలియను కూడా తెలియలేదు పెద్దమనిషికి.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

ఈ ప్రేక్షకులే తర్వాత ఓటర్లుగా మారారు. తెరమీద చేసిన అద్భుతాలను ఎన్టీయార్ రాజకీయరంగంలో కూడా చేయగలడని నమ్మారు. నమ్మినట్టే అప్పటిదాకా ఏ రాజకీయవేత్తా చేయలేని పనులను ఎన్టీయార్ చేసి చూపించారు. 

1972 నాటికి ఆయన ‘బడిపంతులు’ సినిమాలో అద్భుతంగా నటించారు.  అంటే సినిమా ఫీల్డుకి వచ్చి 23యేళ్లు. ఆయనకు 49యేళ్లు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హిందీ సినిమాల తెలుగు వెర్షన్లో వేయడం మొదలెట్టారు. జంజీర్- నిప్పులాంటి మనిషి, దీవార్ – మగాడు, యాదోంకీ బారాత్ – అన్నదమ్ముల అనుబంధం. యిలా. ఎదురులేని మనిషి వచ్చింది. స్టెప్స్ వేయడం మొదలయింది. ఈ ధోరణిలో సాగుతూండగానే అడవిరాముడు వచ్చింది. సూపర్ డూపర్ హిట్. అంతే, యిక అక్కణ్నుంచి యమగోల, వేటగాడు, డ్రైవర్ రాముడు, ఆటగాడు, సూపర్మాన్ – ఒకటా, రెండా. యివన్నీ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈయన తీసిన పౌరాణికాలంతగా విజయవంతం కాలేదు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కారణంగా. 

రామారావు యంగ్ జనరేషన్కి చేరువైంది యీ సినిమాల ద్వారానే. వాళ్లే ఆయనకు రాజకీయాల్లో వోట్బ్యాంక్ అయ్యారు. ఇక చివరికి వచ్చేసరికి బొబ్బిలిపులి, కొండవీటి సింహం – ఒక రకంగా చెప్పాలంటే ముందు తరంలోని పౌరాణిక పాత్రల చిత్రీకరణ ఈ తర్మలో సాంఘికాలలో రూపొందించారు.

గొప్ప నటుడు, రచయిత, మంచి దర్శకుడు, అభిరుచి గల నిర్మాత అయిన రామారావుకు కెరియర్ ప్లానింగ్ అవసరమూ పడలేదు. నాగేశ్వరరావుగారి కయితే తనకు సూటయ్యేవి ఏవి అని వెతుక్కోవడం అదీ వుండింది. ఈయన ఏవి వస్తే అవి వేసేయడమే! జంకు, గొంకులేదు.

ఇలా చెపుతూ పోతే ఎంత స్థలమూ చాలదు. నటుడిగా ఆయన వేయలేని పాత్ర లేదన్నట్టు తనివితీరా వేశారు. టాప్ రాంక్లో వుండగానే రిటైరయ్యారు. దక్షిణాదిన హైయస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా వుండే పొజిషన్లో తప్పుకుని తన సుప్రిమసీని చాటుకున్నారు. ఆయన నటుడు మాత్రమే కాదు, సినిమారంగంలో ఆయనకు తెలియని విభాగం లేదంటారు. రామారావుగారు తన సినిమాల్లో పాటలు దగ్గరుండి ఎలా రాయించుకునేవారో నారాయణరెడ్డిగారు రాసిన పుస్తకంలో చూస్తే తెలుస్తుంది. ఇన్ని పనులు ఆయన ఎలా చేయగలిగారో  అని ఆశ్చర్యం వేస్తుంది.

క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, సమయపాలన. వాటి గురించి వందలాది ఉదాహరణలు చెప్తారు. ఇలా చెప్తూ పోతే అంతే వుండదు. దర్శకుడిగా రామారావు, నిర్మాతగా రామారావు, రాజకీయ వేత్తగా రామారావు.. యిలా ఎన్నో చెప్పవలసి వుంది.

error: Content is protected !!