how-to-get-GPA-10/10-SSC-10th-Class-Public-Exams-Social-Studies-S.S
పరీక్షల ముందు ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే సందేహాలు విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తూంటాయి.
అయితే తగిన మెలకువలు పాటిస్తే వాటిని అధిగమించి, పరీక్షల్లో మంచి స్కోరు సంపాదించవచ్చు.
పదోతరగతి విద్యార్థులకు శ్రమించే తత్వం, సన్నద్ధత చాలా ముఖ్యం.
కష్టపడి చదవటం అలవాటు చేసుకోవాలి. చదివేటప్పుడూ, రాసేటప్పుడూ ‘ఇక చాలు’ అనే భావన రానీయకండి.
ఇంకాస్త చదివితే మార్కులు పెరుగుతాయి.
కొంచెం ఆలోచించి రాస్తే మరో అర మార్కు సంపాదించవచ్చు అనే భావనతో పరీక్షలు రాయండి.
ప్రణాళిక:
ఏ పని చేపట్టినా ఒక పద్ధతిని ఆచరిస్తే ఫలితం బాగుంటుంది. ప్రతి సబ్జెక్టుకూ కొంత సమయం కేటాయించాలి.
ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి, వాటిని బాగా చదివి, చూడకుండా రాయాలి. రాని ప్రశ్నలను వదిలివేయకుండా మళ్ళీ ప్రయత్నించాలి.
ప్రశాంతత:
పరీక్షలంటే భయపడితే చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది.
వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సన్నద్ధమయ్యేటప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడూ కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ‘నేను సాధించగలను, తప్పక సాధిస్తాను’ అనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
చేతిరాత:
పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది.
అందువల్ల దీనిపై శ్రద్ధ వహించాలి.
ఒకవేళ మీ చేతిరాత బాగుండకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు.
దస్తూరి అందంగా ఉండటం ముఖ్యం కాదు; మీరు రాసింది దిద్దేవారికి అర్థం కావాలి.
అందుకు పదానికీ పదానికీ¨ మధ్య కాస్త ఖాళీ ఇవ్వండి.
అలాగే ప్రతి రెండు వాక్యాల మధ్యా కొంచెం దూరం పాటించండి. అంతే!
పునశ్చరణ:
పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఇంతకుముందు చదివిన ప్రశ్నలనే పునశ్చరణచేస్తూ అవగాహన పెంచుకోవాలి.
పరీక్షకు ముందు సబ్ హెడ్డింగ్స్, ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చదవాలి.
1, 2, 4 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలపై పట్టు సాధించాలి.
ఛాయిస్ లేని 1/2, 1, 2 మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
రోజూ ఒకటి లేదా రెండు వ్యాసరూప ప్రశ్నలు రాయడాన్ని సాధన చేస్తే పరీక్షలో వేగంగా, తప్పులు లేకుండా విషయాన్ని వివరించడం సాధ్యమవుతుంది.
స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలను ఇప్పటికే చాలావరకు చదివిఉంటారు.
వాటిని మినహాయించి మిగతా ప్రశ్నలపై దృష్టి పెట్టండి.
జవాబులను చదివేసమయంలో బిట్లుగా వచ్చే పాయింట్లను అండర్‌లైన్ చేసి ఉంచుకోండి.
పరీక్షలు సమీపించినప్పుడు వాటిని పునశ్చరణ చేయండి.
ప్రశ్నపత్రం చదవాలి: పరీక్షల్లో విద్యార్థులంతా సాధారణంగా చేసే పొరపాటు. ప్రశ్నపత్రాన్ని చదవడానికి 15 నిమిషాలు కేటాయించి, ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి.
ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదివితే ఎలా రాయాలి అనే అంశంపై స్పష్టత ఏర్పడుతుంది. అలాగే సమయపాలన తేలికవుతుంది.
మార్కులకు అనుగుణంగా:
ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ఏయే అంశాలను తప్పనిసరిగా రాయాలి అనే దానిపై విద్యార్థులకు స్పష్టత అవసరం.
అడిగిన ప్రశ్నకు ఏ పాయింట్లు ఉంటే పూర్తి మార్కులు పొందుతారో తెలుసుకొని ఉండాలి.
మొదట ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా తప్పనిసరిగా రాయాల్సిన అంశాల తర్వాతే, మిగతావి రాయటం మేలు.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
అవసరముంటేనే అడిషనల్స్:
అదనపు జవాబుపత్రాలను (అడిషనల్స్) అవసరంమేరకే తీసుకోండి.
ఎక్కువ పేజీల్లో సమాచారం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు అనేది అపోహే. జవాబు పత్రాల్లో అవసరానికి మించి ఖాళీలు వదిలి ఎక్కువ అడిషనల్స్ తీసుకోవద్దు.
ఇలా చేయడం వల్ల మీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి విసుగ్గా అనిపించడంతోపాటు మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.
ఎక్కువ పేజీలు ఉంటే ఎక్కువ మార్కులు ఇస్తారని రాసిన జవాబునే మళ్లీ రాయవద్దు.
అవసరమైన మేరకే రాయాలి. అనవసర విషయాలు చర్చించడం వల్ల మార్కులు తగ్గడం, సమయం వృథా కావడం తప్ప ప్రయోజనం ఉండదు.
సమయ సద్వినియోగం:
కొందరు విద్యార్థులు పరీక్షలో సమయం చూసుకోకుండా రాస్తూనే ఉంటారు. ఇలాంటివారు తమకు తెలిసిన జవాబులు రాయకుండానే పేపర్ ఇచ్చేయాల్సి వస్తుంటుంది.
అలా జరగకుండా ఉండాలంటే ఆయా ప్రశ్నలకు నిర్దేశిత సమయాన్ని మాత్రమే కేటాయించండి.
మొదట మీకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మరిచిపోయిన జవాబులను చివరిలో ప్రయత్నించండి.
ప్రశ్నల నంబరు వేయడం మరవకండి.
వీటిని మార్జిన్ ఎడమపక్క వేయాలి.
జవాబుల్లో ఉపశీర్షికలు (సబ్‌హెడ్డింగ్స్) ఉంటే వాటిని అండర్‌లైన్ చేయాలి. ఉపశీర్షికలు లేని సమాధానాల్లోని పాయింట్స్‌లో ముఖ్యపదాలను అండర్‌లైన్ చేయండి.
అదనపు (ఛాయిస్) ప్రశ్నలకు ముందే రాయకండి. చివరిలో సమయం ఉంటేనే రాయండి.
జవాబులను పూర్తిగా రాయాలి.
అవసరమైనచోట అదనపు పాయింట్లను జతచేయాలి. అర్థమయ్యే చేతరాత, క్రమబద్ధంగా రాసిన జవాబులు, ఉప విభాగాలు, ముఖ్యమైన పదాలను అండర్‌లైన్ చేయడం, మార్జిన్ వదలడం, ప్రశ్నపత్రం దిద్దేవారిని ఆకట్టుకుంటాయి. అన్ని జవాబులూ రాసిన తర్వాత, జవాబు పత్రాన్ని అంతా చదివి తప్పులుంటే సరిచేయండి.
భూగోళశాస్త్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు భారతదేశ పటాన్నీ, చరిత్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు ప్రపంచపటాన్నీ దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పటాలను చూస్తూ చదవండి.
ఒకసారి చదివితే ఏదీ రాదు. వచ్చేవరకూ చదవండి.
బిట్స్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) బట్టీ పట్టవద్దు. డ్రిల్లింగ్ (ఒకరిని ఒకరు అడగటం) చేస్తే మేలు.
వ్యాఖ్యానించడం:
‘ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి వ్యాఖ్యానించడం’ అనే నైపుణ్యంలో ఇచ్చే పేరాను కొంతమంది ఉన్నది ఉన్నట్లు రాస్తున్నారు. ఇలా చేయకూడదు.
పేరాను పూర్తిగా చదవండి. ప్రశ్నను అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన అంశాలు మాత్రమే రాయండి. అభిప్రాయాలు అడిగినప్పుడు ఆ పేరాలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాయండి.
దీనికోసం పాఠ్యపుస్తకంలోని రెండు పేరాలను తీసుకుని సాధన చేయండి.
పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలు:
పాఠ్యపుస్తకంలో ఉన్న పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలను పరిశీలించండి.
ఆ పట్టిక మనకు ఏమి తెలియచేస్తుంది? సమాచారంలో మొదటి, చివరి స్థానంలో ఏం ఉన్నాయి? వాటి మధ్య తేడా ఏమిటి? ప్రత్యేకత ఏమిటి? పటాలైతే ఏ దిక్కులో ఏ దేశాలున్నాయి? భారతదేశపటంలో ఏ వైపు ఏ రాష్ట్రాలున్నాయి? మొదలైన ప్రశ్నలతో వాటిని పరిశీలనాత్మక ధోరణిలో చూడండి.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
పట నైపుణ్యాలపై అవగాహన ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
ఈ నైపుణ్యంలో మూడు విధాలుగా ప్రశ్నలు వస్తాయి.
రాష్ట్రాలను, భారతదేశ చిత్తుపటాలను గీయమనడం; ప్రాంతాలను, దేశాలను గుర్తించమనడం; గుర్తించిన పటాన్నిచ్చి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమనడం. ఈ మూడింటినీ సాధన చేయండి.
ఈ సాధన ద్వారా సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలను బట్టీపట్టకుండా అర్థం చేసుకోవచ్చు.
దేశాలు, దీవులు, ఇతర ప్రాంతాలను కొన్ని ఆకారాల్లో (జంతువులు, పక్షులు, అక్షరాలు, అంకెలు) గుర్తుపెట్టుకుంటే వాటిని సులభంగా గుర్తించవచ్చు.
మ్యాప్‌ను గుర్తించేటప్పుడు ప్రశ్న సంఖ్యను అక్కడ వేయకూడదు.
గుర్తించిన చోట పేరు మాత్రమే రాయాలి. ఒకవేళ స్థలం లేకపోతే బాణం గుర్తువేసి రాయాలి. లేదా గుర్తించాల్సిన ప్రదేశంలో మ్యాప్‌పై సంఖ్యవేసి, ఎదురుగా పేరు రాయాలి.
సమకాలీన అంశాలు:
ఈ నైపుణ్యంలో పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి.
* మొదటి పేపర్‌లో- పాఠశాల విద్య, భ్రూణహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, లింగ వివక్ష, మధ్యాహ్న భోజన పధకం, మురికి వాడలు, చౌకధరల దుకాణాలు, నీరు- అమ్మకాలు, నీటి కాలుష్యం, భూగర్భజలాలు, ప్రపంచీకరణ, పోషకాహారం, భూగోళం వేడెక్కడం, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్‌పొర.
* రెండో పేపర్‌లో- ప్రపంచయుద్ధాలు, భారతదేశంతో ఇతర దేశాల సంబంధాలు, ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, నూతన రాష్ట్రాలు, జిల్లాల ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, సామాజిక ఉద్యమాలపై దృష్టిపెట్టండి.
బిట్‌పేపర్ రాసేటప్పుడు:
బిట్‌పేపర్ ఇచ్చిన వెంటనే మెయిన్ పేపర్ రాయడం ఆపి బిట్‌పేపర్ పూర్తి చేయాలి.
సమయం ఉంటే ఆ తర్వాత మెయిన్ పేపర్ రాయాలి.
* A, B, C, D లు బ్రాకెట్టులో రాసేటప్పుడు సరిగా రాయండి.
జవాబులు తప్పు రాశామనుకుంటే దానిపై దిద్దవద్దు. తప్పు అనుకున్నదాన్ని పూర్తిగా కొట్టివేసి, అప్పుడు సరైన సమాధానం రాయాలి.
అన్ని బిట్లనూ పూరించండి. ఒక్కోసారి ఏదైనా బిట్ తప్పుగా రావచ్చు. ఇలాంటివి అటెమ్ట్ చేస్తే మార్కు వస్తుందని మర్చిపోవద్దు.
ముఖ్యమైన ప్రశ్నలు
పేపర్-1
-
‘వ్యవసాయానికి మైదాన ప్రాంతాలు తోడ్పడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు’. ఈ పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది?
-
మిగతా రంగాలకంటే సేవారంగానికి ప్రత్యేకత ఉంది. కొన్ని ఉదాహరణలతో వివరించండి. (ఏపీకి మాత్రమే)
3. మీ రాష్ట్రంలో ‘పాఠశాల విద్యను విప్లవం‘గా చేపట్టాలంటే ఏమి చేయాలో తగు సూచనలు ఇవ్వండి.
-
‘భూగోళం వేడెక్కడానికి మానవుడే కారణం’. వివరించండి.
-
వలసలు వెళ్ళినవారు ఆ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా/సమస్యలకు కారణం అవుతారా? మీ సమాధానానికి కారణాలు రాయండి?
-
ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరుస్తుంది అని ఒకరంటే దేశాభివృద్ధికి సహాయపడుతుంది అని మరొకరు అంటున్నారు- వ్యాఖ్యానించండి.
-
పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం రావడానికి రెండు నినాదాలు రాసి, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
-
‘ప్రత్యేక ఆర్థిక మండలి’ (సెజ్) అని దేన్ని అంటారు? వివరించండి?
-
భారతదేశ చిత్రపటాన్ని గీచి, మీ రాష్ట్రాన్ని, దాని రాజధానిని గుర్తించండి.
-
ఆనకట్టలు కట్టడం వలన ఎవరికి లాభం కలుగుతుంది? ఎవరికి నష్టం కలుగుతుంది?
పేపర్-2
-
రెండో ప్రపంచ యుద్ధానికి దోహదం చేసిన ప్రత్యేక అంశాలేవి?
-
లెనిన్, స్టాలిన్‌లు రష్యాసమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు?
-
చైనాలో భూ సంస్కరణల కోసం చేపట్టిన కార్యక్రమాలు రాసి, వాటి ఫలితాలు తెల్పండి.
-
సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో పటేల్ కృషిని ప్రశంసించండి?
-
రాజ్యాంగ సభ చర్చల్లో ‘అంటరానితనం’ అనే అంశంపై ప్రొమథరంజన్ ఠాకూర్ ఏమన్నారు?
-
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను తెలపండి?
* పొరుగు దేశాలతో శాంతియుతంగా ఉండటానికి మన దేశం చేపట్టాల్సిన చర్యలను సూచించండి?
-
బహుళ పార్టీ వ్యవస్థ వల్ల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలపండి?
-
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలను రాయండి?
-
గ్రామపెద్దలు, కోర్టులు వివాదాలు/తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేన్ని ఇష్టపడతారు? ఎందుకు?
-
10th CLASS SOCIAL STUDIES (S.S) PUBLIC EXAMS PAPERS 3 SETS (T.M)
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
