list-of-courses-after-10th-class-AP-TS-students-Telugu

list-of-courses-after-10th-class-AP-TS-students-Telugu

list-of-courses-after-10th-class-AP-TS-students-Telugu

ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ బాగా ఆలోచించిన త‌ర్వాతే అడుగులేయాలి. ఎందుకంటే 15 లేదా 16 ఏళ్ల వ‌య‌సులో పూర్తి ప‌రిణ‌తితో ఆలోచించ‌డం అంద‌రికీ సాధ్యం కాకపోవ‌చ్చు. దీంతో లెక్కల‌కు భ‌య‌ప‌డి బ‌యాల‌జీ, బొమ్మలంటే ఇష్టంలేక‌పోవ‌డంతో కామ‌ర్స్ కోర్సులు తీసుకునేవాళ్లే ఎక్కువ‌. గ్రూపు ఎంపిక ఎప్పుడూ ఒక స‌బ్జెక్టుపై ఇష్టం లేక‌పోవ‌డంతో ఇంకో స‌బ్జెక్టును ఎంచుకునేలా ఉండ‌కూడ‌దు.. అంటే బైపీసీ గ్రూపు తీసుకోవ‌డానికి లెక్కలంటే ఆస‌క్తి లేక‌పోవ‌డమ‌నేది కార‌ణం కాకూడ‌దు. భ‌విష్యత్తులో డాక్టర్ కావ‌డ‌మో, వ్యవ‌సాయ కోర్సుల్లో రాణించ‌డ‌మో ల‌క్ష్యంతో బైపీసీ తీసుకోవాలి. పూర్తిగా ఏ స‌బ్జెక్టంటే ఇష్టమో ఆ కోర్సునే ఎంచుకోవాలి. అలాచేస్తేనే భ‌విష్యత్తులో చేయ‌బోయే కెరీర్‌ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అందుకే ఎంపిక ఎప్పుడు వ్యక్తిగ‌త‌ ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. ఒక స‌బ్జెక్టుపై అయిష్టత ఇంకో స‌బ్జెక్టుపై ఇష్టానికి కార‌ణం కాకూడ‌దు.

ఇత‌రులప్రభావం
సాధార‌ణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల గ్రూపు ఎంపిక‌లో ఇత‌రుల ప్రభావ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఎంపీసీ చ‌దివితే అన్ని ర‌కాల‌గా బాగుంటుంద‌ని ఎక్కువ మంది పెద్దల‌ అభిప్రాయం. కొంత వ‌ర‌కు అది నిజ‌మే కావ‌చ్చు. అయితే పెద్దలు చెప్పార‌ని నిర్ణయం తీసుకోవ‌డం మాత్రం స‌రికాదు. ఎందుకంటే మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల‌పై పెద్దగా ఆస‌క్తిలేక‌పోతే ఎంపీసీ గ్రూపు తీసుకోవ‌డం వ‌ల్ల ఆశించిన ప్రయోజ‌నం ద‌క్కదు. పెద్దల సూచ‌న‌ల‌ను గౌర‌విస్తూనే వ్యక్తిగ‌త ప్రావీణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

కొంత‌మంది విద్యార్థులు తెలిసిన‌వాళ్లు, బంధువులు, కుటుంబ స‌భ్యులు ఆ గ్రూప్‌లో చ‌దువుతున్నార‌ని వాళ్లు కూడా అదే గ్రూపు తీసుకుంటారు. ఈ సంద‌ర్భాల్లో విద్యార్థికి ఆ గ్రూప్‌లో ఉన్న స‌బ్జెక్టుల‌పై ఆస‌క్తి ఉంటే ప‌ర్వాలేదు. లేదంటే ప్రయోజ‌నం ద‌క్కదు.

కొంత‌మంది కేవ‌లం వాళ్ల మిత్రుల‌తో క‌లిసి ఉండొచ్చనే ఒకే ఒక కార‌ణంతో స్నేహితులు తీసుకున్న గ్రూప్‌నే తీసుకుంటారు. మిత్రుల‌తో విడిపోవ‌డం ఎప్పటికైనా త‌ప్పద‌ని వీళ్లు గుర్తుంచుకోవాలి. అందువ‌ల్ల గ్రూపు ఎంపిక‌లో మిత్రుల‌ను లెక్కలోకి తీసుకోవ‌ద్దు. మీ ఇష్టానికే ఓటు వేయండి.

సాంకేతిక ప‌రిజ్ఞానమంటే ఆస‌క్తి, యంత్రాల‌తో ప‌నిచేయాల‌నే త‌ప‌న‌ రెండూ మెండుగా ఉన్నవాళ్లు పాలిటెక్నిక్ కోర్సులు, ఒకేష‌న‌ల్ కోర్సులు లేదా ఐటీఐలో చేరొచ్చు.
ఇంజినీర్ కావ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఇంట‌ర్‌లో ఎంపీసీ గ్రూపును ఎంచుకోవాలి. లేదంటే పాలిటెక్నిక్‌లో కోర్ ఇంజినీరింగ్ డిప్లొమా బ్రాంచ్‌ల్లో చేరాలి. 
మొక్కలు, జంతువులు, వైద్యరంగం వీటిలో దేనిపై ఆస‌క్తి ఉన్నా బైపీసీ తీసుకోవాలి.
అంకెలు, వ‌ర్తక‌రంగం, మ‌దింపు…త‌దిత‌ర అంశాలు ఇష్టమైతే అకౌంట్స్ దిశ‌గా అడుగులేయాలి.
చ‌రిత్ర, స‌మ‌కాలీన సంఘ‌ట‌న‌ల గురించి తెలుసుకోవాల‌నుకున్నవారు ఆర్ట్స్ కోర్సులు తీసుకోవాలి.

సాధార‌ణంగా ఎక్కువ‌ మంది విద్యార్థుల్లో ఉండే సందిగ్ధాలు

ఎంపీసీ అంటే ఇష్టం కానీ లెక్కలంటే క‌ష్టం?
ఇలాంటి విద్యార్థులు సాధ‌న ద్వారా గ‌ణితంలో ప్రావీణ్యాన్ని పొందే అవ‌కాశం ఉందేమో ఒక‌సారి ఆలోచించుకోవాలి. ఆ స‌బ్జెక్టు అంటే పూర్తిగా ఇష్టం లేక‌పోతే ఎంపీసీ జోలికి వెళ్లక‌పోవ‌డ‌మే మంచిది. కానీ గ‌ణితంపై శ్రద్ధ ఉండి అందులో ప‌ట్టు సాధించ‌డం క‌ష్టంగా ఉన్నవారు సాధ‌న ద్వారా మెరుగుప‌ర‌చుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఎంపీసీ తీసుకోవ‌చ్చు.

డాక్టర్ కావాల‌నుంది కానీ ప్రయోగాలు, ర‌క్తమంటే భ‌యం?
బైపీసీ అంటే బొద్దింక‌లు, క‌ప్పల‌ను కోయాలి. వాటిని చూస్తే చ‌చ్చేంత భ‌యం అని భావించి ఈ కోర్సుకి దూర‌మ‌య్యేవాళ్లూ ఉన్నారు. బోట‌నీ, జువాల‌జీ స‌బ్జెక్టుల‌పై ప‌ట్టుంటే నిస్సందేహంగా బైపీసీ దిశ‌గా అడుగులేయ‌డ‌మే మంచిది. జంతువు‌లంటే భ‌యం భ‌విష్యత్తులో ద‌శ‌ల‌వారీ పోతుంది.

సీఏ చేయ‌డానికి ఎంపీసీ, ఎంఈసీల్లో ఏది మంచిది?
ప‌దోత‌ర‌గ‌తి పూర్తికాగానే ఏది ఏమైనా సీఏ కోర్సు చేయాల్సిందే అని క‌చ్చితంగా తీర్మానించుకున్నవాళ్లు ఎంఈసీ గ్రూప్‌లో చేర‌డమే ఉత్తమం. ఈ గ్రూప్‌లో ఉండే మ్యాథ్స్, ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్ స‌బ్జెక్టుల‌న్నీ సీఏ ఫౌండేష‌న్‌తోపాటు మిగతా సీఏ కోర్సులోనూ ప‌నికొస్తాయి. అదే ఎంపీసీ అయితే ఫిజిక్స్‌, కెమిస్ట్రీల‌తో సీఏ కోర్సులో ఎలాంటి ప్రయోజ‌న‌మూ ద‌క్కదు. కాబ‌ట్టి సీఏ కోర్సు చేయ‌డ‌మే భ‌విష్యత్తు ల‌క్ష్యమైతే ఎంఈసీకి మించిన కోర్సు లేదు. ఎంఈసీలో చేరిన త‌ర్వాత ఇంజినీరింగ్ చేయ‌డం సాధ్యం కాదు. కాబ‌ట్టి కోర్సులో చేర‌క‌ముందే క‌చ్చితమైన నిర్ణయం తీసుకోవ‌డం ముఖ్యం.

ఎంపీసీ గ్రూపు చ‌దివిన విద్యార్థి ఆ అర్హత‌తో ఇంజినీరింగ్ చేయొచ్చు. దీనికోసం ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ లాంటి ప‌రీక్షలు రాయాలి. లేదంటే నేరుగా డిగ్రీ కోర్సుల్లో చేరొచ్చు. ప‌లు ఐఐటీలు, సెంట్రల్‌, స్టేట్ యూనివ‌ర్సిటీలు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల‌ను అందిస్తున్నాయి. వాటిలోనూ చేరొచ్చు. డీఈఈ సెట్‌ రాసి డీఎడ్ కోర్సులోనూ ప్రవేశించొచ్చు. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులనూ అభ్యసించ‌వ‌చ్చు. ఆస‌క్తి ఉంటే బీఫార్మసీ, ఫార్మ్‌-డీ కోర్సులు చ‌దువుకోవ‌చ్చు.ఇవేకాకుండా సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ, సీఎస్ కోర్సుల దిశ‌గా అడుగులేయ‌వ‌చ్చు. లా కోర్సుల్లోనూ ప్రవేశించొచ్చు.

బైపీసీ గ్రూప్‌లో చేరిన‌వారు నీట్‌తో ఎంబీబీఎస్ కోర్సులో చేరొచ్చు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్ ద్వారా ఆయుర్వేద‌, హోమియో, యునానీ, అగ్రిక‌ల్చర‌ల్‌ బీఎస్సీ, వెట‌ర్నరీ కోర్సుల్లో ప్రవేశించ‌వ‌చ్చు. ఇవేకాకుండా బీఎస్సీ న‌ర్సింగ్‌, ఫిజియోథెర‌పీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఫార్మసీ, ఫార్మ్ డి కోర్సులు కూడా ఉన్నాయి. అలాగే ఎంపీసీ విద్యార్థుల మాదిరి వీరుకూడా డీఈఈ సెట్‌ రాసి డీఎడ్‌లోకి ప్రవేశించ‌వ‌చ్చు లేదా బీఎస్సీ కోర్సుల్లో చేరొచ్చు. సెంట్రల్‌, స్టేట్ యూనివ‌ర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల‌నూ చ‌దువుకోవ‌చ్చు. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్‌, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లాంటి కోర్సుల‌నూ అభ్యసించ‌వ‌చ్చు. లా కోర్సుల్లోనూ ప్రవేశించొచ్చు. ఇవేకాకుండా సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ, సీఎస్ కోర్సుల దిశ‌గా అడుగులేయ‌వ‌చ్చు.

ఎంఈసీ కోర్సులో చేరిన‌వారు అనంత‌రం డిగ్రీలోనూ ఎంఈసీ కోర్సు చేయొచ్చు. వీళ్లుకూడా వివిధ సెంట్రల్‌, స్టేట్ యూనివ‌ర్సిటీల్లో మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు చ‌దువుకోవ‌చ్చు. లేదంటే డీఈఈ సెట్‌ ద్వారా డీఎడ్ కోర్సు చ‌దువుకోవ‌చ్చు. ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల‌వైపు మొగ్గుచూపొచ్చు. లా కోర్సుల్లోనూ ప్రవేశించొచ్చు.

సీఈసీ చ‌దివిన‌వారు అనంత‌రం నేరుగా బీకాం కోర్సులో లేదంటే ఎక‌నామిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులో చేరొచ్చు. డైట్ సెట్ ద్వారా డీఎడ్ చ‌ద‌వొచ్చు. ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లోనూ ప్రవేశించ‌వ‌చ్చు. అకౌంటింగ్‌కి సంబంధించి సీడ‌బ్ల్యుఏతోపాటు ప‌లు ర‌కాల ప్యాకేజీ కోర్సులు (టాలీ లాంటివి) కూడా నేర్చుకునే అవ‌కాశం ఉంది. లా కోర్సుల్లోనూ ప్రవేశించొచ్చు.

హెచ్ఈసీ గ్రూప్‌లో చేరిన‌వాళ్లు డిగ్రీలోనూ అదే కోర్సుల్లో చేరొచ్చు. వీరు లాసెట్ ద్వారా లాయ‌ర్ కెరీర్ దిశ‌గా అడుగులేయ‌వ‌చ్చు. డీఈఈ సెట్ ద్వారా డీఎడ్ కోర్సులో చేరి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవ‌చ్చు. ఎక‌నామిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీజీ, ఇంటిగ్రేటెడ్ బీఏ బీఎడ్ కోర్సుల్లోనూ చేర‌వ‌చ్చు.

రెండేళ్ల ఇంట‌ర్ ఒకేష‌న‌ల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు వాటిని పూర్తిచేసుకుని నేరుగా డిప్లొమా రెండో సంవ‌త్సరంలో చేరొచ్చు. అలాగే ఐటీఐలోనూ కొన్ని ట్రేడ్‌ల్లో చేరిన‌వారికి ఈ అవ‌కాశం ఉంటుంది.

పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన‌వారు ఇంజినీరింగ్‌లో నేరుగా ద్వితీయ సంవ‌త్సరం కోర్సులో చేరే అవ‌కాశం ఉంది.

వ్యవ‌సాయ కోర్సుల‌పై ఆస‌క్తి ఉన్నవాళ్లు అగ్రిక‌ల్చర‌ల్ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరొచ్చు. వెట‌ర్నరీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తయిన త‌ర్వాత పై చ‌దువులూ చ‌దువుకోవ‌చ్చు.

ఉచితంగానూ చ‌దువుకోవ‌చ్చు
కొంచెం తెలివితేట‌లు ఉంటేచాలు ప‌దోత‌ర‌గ‌తి త‌ర్వాత చ‌దువుల‌కు డ‌బ్బు స‌మ‌స్య కాదు. ఎందుకంటే ఇంట‌ర్‌తోపాటు ఇంజినీరింగ్ ఆరేళ్లు ఉచితంగా చ‌దువుకోవ‌డానికి ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. అలాగే ఇంట‌ర్ చ‌ద‌వాలంటే ఆర్‌జేసీలు, సాంకేతిక విద్యను అభ్యసించాలంటే ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. కాబ‌ట్టి కార్పొరేట్ చ‌దువులు చ‌ద‌వ‌లేనివాళ్లు దిగులు చెందాల్సిన ప‌ని లేదు. ప్రభుత్వ క‌ళాశాల‌ల్లో విద్యన‌భ్యసించి రాణిస్తోన్న విద్యార్థుల సంఖ్య త‌క్కువేమీ కాదు.

అన్ని కోణాల్లోనూ ఆలోచించిన‌ త‌ర్వాతే భ‌విష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. కోర్సు లేదా కెరీర్ ఎంపిక స‌రిగా ఉంటే దాదాపు స‌గం విజ‌యం ఖాయ‌మైన‌ట్టే. అలాకాకుండా ఎంపీసీలో చేరిన ఏడు నెల‌ల త‌ర్వాత అయ్యో బైపీసీ తీసుకోవాల్సిందే అనుకోవ‌డం వ‌ల్ల ఏడాది వృథా కావ‌డం త‌ప్ప మ‌రే ప్రయోజ‌నమూ ఉండ‌దు. అందుకే ప‌దోత‌ర‌గ‌తి త‌ర్వాత ఇంట‌ర్‌లో ఉండే వివిధ గ్రూపులు, ఒకేష‌న‌ల్‌, పాలిటెక్నిక్ కోర్సులు, ఐటీఐ, ఆర్‌జేసీ, ట్రిపుల్ ఐటీలు, ఉద్యోగాలు…ఈ స‌మాచారాన్నంతా విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాం.

S.A-2 ANNUAL EXAMS PAPERS, SCERT PAPERS, PREVIOUS PAPERS CLICK HERE FOR DOWNLOAD

LATEST JOBS & CAREER ADMISSIONS CLICK HERE

error: Content is protected !!