*♦ఈ ఏడాది 2020_21 ‘జీరో’ విద్యా సంవత్సరమేనా?*
*♦ఎప్పటికి తగ్గుతుందో తెలియని కరోనా మహమ్మారి*
*♦స్కూళ్లు తెరిచినా పంపేందుకు తల్లిదండ్రుల విముఖత*
*♦అకడమిక్ క్యాలెండర్ రూపొందించని ప్రభుత్వాలు*
*♦కర్ణాటకలో ఇప్పటికే ‘జీరో ఇయర్’గా ప్రకటన*
*♦యూజీసీ పరిశీలనలో సిలబస్, క్లాసుల కుదింపు!*
*♦సాధ్యాసాధ్యాలపై జాతీయ స్థాయిలో చర్చ*
*♦ఆన్‌లైన్ క్లాసులు ప్రత్యామ్నాయం కాదనే వాదన*
🛑 బడి గంటలు మోగి మూడు నెలలు దాటిపోయింది! లాక్‌డౌన్‌లోనే వేసవి సెలవులు ముగిశాయి. ‘జూన్ 12’న తెరుచుకోవాల్సిన బడి తలుపులు… ఇప్పటికీ తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియదు. 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు లేకుండానే ‘ప్రమోషన్’ కొట్టేశారు. పదో తరగతి పరీక్షల్లో మూడు గ్రేస్ మార్కులు కలిపితేనే అద్భుతం అనుకుంటే… అసలు పరీక్షలే లేకుండా పాస్ చేసేశారు! ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్… ఇలా అన్ని కాలేజీలూ మూతే! వృత్తి విద్యా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘సెట్స్’ పరిస్థితి పూర్తిగా అయోమయం! అసలేం జరుగుతోంది? 2020-21 విద్యాసంవత్సరం ఉంటుందా? లేక… కరోనా కాలంలో కలిసిపోతుందా?
🛑 ఇవీ తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో నెలకొన్న సందేహాలు! అసలు విషయం ఏమిటంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి!
లాక్‌డౌన్ ముగిసి… అన్‌లాక్ రెండో దశలోకి ప్రవేశించాం! కానీ… బడులు, కాలేజీలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు. ఈ నేపథ్యంలో… 2020-21 ‘జీరో’ విద్యాసంవత్సరంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. సిలబస్‌ను 50 శాతం తగ్గించి… తరగతులను, పనిదినాలను కుదించి విద్యాసంస్థలను నిర్వహించాలని యూజీసీ ప్రతిపాదిస్తోంది. అయితే… ఆచరణలో దీని సాధ్యాసాధ్యాలపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఎందుకంటే… విద్యాసంస్థలు తెరిచినప్పటికీ పిల్లలను పంపించేందుకు చాలామంది తల్లిదండ్రులు సుముఖంగా లేరు. మరీముఖ్యంగా… 1నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లల విషయం లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వర్షాకాలంలో కరోనా మరింత విజృంభించవచ్చన్న సంకేతాలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
*♦‘ఆగస్టు 3’ కుదురుతుందా?*
ఆగస్టు 3నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు కొన్నాళ్ల క్రితం తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తేదీన విద్యాసంస్థలు తెరిచే అవకాశమైతే కనిపించడంలేదు. బుధవారం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలోనూ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ‘‘విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం’’ అని తెలిపారు. కొవిడ్ ఉద్ధృతితో విద్యాసంస్థలు ప్రారంభించే విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన విధానాన్ని ప్రకటించలేదు. గతేడాదికి సంబంధించి సీబీఎ్‌సఈ 10-12తరగతుల పరీక్షలు రద్దయ్యాయి. పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోనూ టెన్త్ పరీక్షలు రద్దుచేశారు.
♨️ యూజీ, పీజీకోర్సుల సెమిస్టర్ పరీక్షలు కూడా రద్దుచేసే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. దేశంలో ఎక్కడా విద్యా సంవత్సరం ప్రారంభంకాలేదు. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెరుచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు 2020-21 విద్యా సంవత్సరపు అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే కర్ణాటక ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరాన్ని రద్దుచేసింది. ఇతర రాష్ట్రాలూ ఇదే నిర్ణయం తీసుకునే అవకాశముందనే అభిప్రాయం వినిపిస్తోంది. విద్యా సంవత్సరాన్ని అక్టోబరులో ప్రారంభించినా 2021 జూన్ వరకు కొనసాగించి… ముగించవచ్చునని కొందరు పేర్కొంటున్నారు. ఇదంతా పూర్తిగా వైరస్ కట్టడిపైనే ఆధారపడి ఉంటుంది.
*♦అందరికీ ఆన్‌లైన్ ఎలా?*
కరోనా నేపథ్యంలో కొన్ని సమస్యలున్నా ఆన్‌లైన్ విధానాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం అనివార్యం కావచ్చన్నది కొందరి అభిప్రాయం. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే… ఈ పాఠాలకు అధికారిక గుర్తింపు లేదు. పైగా, ఈ తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమంటూ పలు జిల్లాల డీఈవోలు సర్క్యులర్లు జారీ చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరిస్థితి లేదు. ఇంట్లో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఉన్నవారికే ఈ తరగతులు వినే అవకాశం ఉంటుంది. పేద కుటుంబాల పిల్లలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ఈ విధానం అమలు ఎంతవరకూ సాధ్యమనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏ విధంగా చూసినా ఆన్‌లైన్ తరగతులు పాఠశాల బోధనా విధానానికి ప్రత్యామ్నాయం కాదన్న అభిప్రాయాలే అధికంగా వినిపిస్తున్నాయి