మనకు తెలిసిన వాటినే మళ్లీ వివరంగా తెలుసుకుంటూ సరదాగా చదువుకునేదే జీవశాస్త్రం.
దీని అధ్యయనంలో మొక్కలు, జంతువులు మన జీవితాలతో ఎలా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది.
జీర్ణక్రియ జరిగే తీరు.. మూత్రపిండాల మాయాజాలం.. విటమిట్ల విశిష్టత వంటివన్నీ మనకు సంబంధించినవే.
వాటిపై అవగాహన పెంచుకొని పరీక్షలో బొమ్మలు వేసి సమాధానాలు రాస్తే మంచి మార్కులు వస్తాయి.
అందుకే బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేయాలి.
పదో తరగతి జీవశాస్త్రం (బయాలజీ)లో మనకు తెలిసిన విషయాలనే కాస్త లోతుగా తెలుసుకుంటాం.
ఈ సబ్జెక్టులో పట్టు కోసం స్నేహితులతో చర్చించటం,
ఉపాధ్యాయులనుంచి సందేహాలు నివృత్తి చేసుకోవడం, ప్రయోగాలను అర్థం చేసుకోవటం, పటాలు గీయడంలో నైపుణ్యం సాధించటం అవసరం.
అర్థం చేసుకున్నది సొంత వాక్యాల్లో రాస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు.
స్వీయరచనకు ప్రాధాన్యమిస్తూ ప్రతి అంశాన్నీ వివరించి రాయడం నేర్చుకోవటం మేలు.
తార్కిక ఆలోచనతో ప్రశ్నలను అర్థం చేసుకుని, తగిన సమాధానాన్ని రాస్తే అత్యధిక మార్కులు/గ్రేడు సంపాదించవచ్చు.
పరీక్షలో ఇచ్చే ప్రశ్నలు విద్యార్థి జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, నిత్య జీవిత వినియోగాన్ని పరీక్షించేలా ఉంటాయి.
వీలున్నంతవరకూ ఫ్లో చార్టులు వేయడానికీ, బొమ్మల ద్వారా వివరించడానికీ ప్రయత్నించండి.
ప్రశ్నపత్రం చదవడానికి ఇచ్చిన సమయం వినియోగించండి.
ప్రశ్నలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే అడిగిన ప్రశ్న ఒకటి, రాసిన జవాబు ఒకటి అయ్యే ప్రమాదం ఉంది.
పాఠ్యాంశాలలోని భావనలను అర్థం చేసుకొని సొంతంగా వివరించడం, ఉదాహరణలివ్వడం, పోలికలు, భేదాలు చెప్పడం, కారణాలు వివరించడం, విధానాలను విశదీకరించడం చేయగలగాలి.
అవసరమైన సమాచారాన్ని విశ్లేషించి, రాయడం సాధన చేయండి.
ప్రయోగాల గురించి రాసినపుడు, ప్రయోగ విధానాన్ని వివరిస్తూ, అర్థం అయ్యేలా పటాలు గీసి, భాగాలు గుర్తించాలి.
ఒక మార్కు ప్రశ్నలు సరిగ్గా రాయాలంటే పాఠాలు ఆమూలాగ్రం అర్థం చేసుకోవాలి.
సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
సన్నద్ధత సమయంలో అవసరమైనచోట పటాలు, మైండ్ మ్యాపులు, పట్టికలు తయారు చేసుకోండి.
ప్రతి పాఠం నుంచి ముఖ్యమైన పదాలు ఉంటాయి.
విద్యార్థులు వీటికి అర్థాలు తెలుసుకుని, నోట్సులో రాసుకుంటే చాలా ఉపయోగం.
పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా కాక సొంతంగా జవాబులు రాయండి.
అవసరమైనచోట పటాలు గీయండి.
సందేహం వచ్చిన అంశాలపై ప్రత్యేకంగా నోట్సు తయారు చేసుకోండి.
పాఠ్య పుస్తకంలోని అభ్యాసాలలో ఇచ్చిన ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్లుగా పబ్లిక్ పరీక్షల్లో ఇవ్వరు.
అలాంటి స్వభావం ఉన్న ప్రశ్నలను రూపొందించి ఇస్తారు.
ఏ ప్రశ్నకు ఎంత సమయంలో జవాబు రాయాలో నిర్ణయించుకోవాలి.
ముందు రాసే ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయిస్తే, తరువాతి వాటికి సమయం సరిపోదు. అందుకే మాదిరి పరీక్షలు రాస్తూ ఉంటే అవగాహన వస్తుంది. మైండ్ మ్యాపులు మనం నేర్చుకున్న అంశాన్ని దృశ్యీకరించి, ఆ అంశాన్ని ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తాయి. పూర్వ కాలం నుంచి ఈ మైండ్ మ్యాపులను వాడేవారు.
ముఖ్యమైన అంశాలకు మైండ్ మ్యాపులు వేసుకోవడం నేర్చుకుంటే పాఠంలోని అంశాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. పరీక్షల సమయంలో ఈ మ్యాపుల ప్రాముఖ్యం ఎక్కువ.
ముఖ్యమైన ప్రశ్నలు
1. శోషరస వ్యవస్థను నువ్వు ఎలా అభినందిస్తావు? (2 మార్కులు)
2. అరవింద్ ఒక జంతుశాస్త్ర అధ్యాపకుడి వద్దకు వెళ్లి, వివిధ రకాల జీవులలో ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థల గురించి సమాచారం సేకరించాడు. అతను ఈ సమాచారాన్ని తన ప్రాజెక్టు పుస్తకంలో నమోదు చేశాడు. మీరు కూడా ఇటువంటి సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో చూపగలరా?
(4 మార్కులు)
3. హార్దిక వలయ సమయం మీకు తెలుసా? ఎంత సమయంలో ఒక హార్దిక వలయం పూర్తవుతుంది? (1 మార్కు)
4. కరుణ వాళ్ల మామయ్యను మూత్రపిండాల సమస్యతో ఆసుపత్రిలో చేర్చారు. కరుణ ఆయనను చూడ్డానికి వెళ్లినప్పుడు, అక్కడ ఆయనకు ఏదో చికిత్స ప్రక్రియ జరపడం చూసింది. ఆ ప్రక్రియ మూత్రపిండాలలోని వ్యర్థాలను ఫిల్టర్ చేస్తుందని తెలుసుకుంది. మీరే కరుణ అయితే, ఈ ప్రక్రియ గురించి డాక్టరును ఏమని ప్రశ్నిస్తారు?
5. చిత్రాలను (తంగేడు, తుమ్మ, పైనస్, వేప, జట్రోఫా, రబ్బరు) చూడండి. ఈ మొక్కల విసర్జక పదార్థాలు ఏమిటో తెలుపగలరా? ఈ స్రావాలు మనకు ఎలా ఉపయోగపడతాయి?
6. ప్రచోదనాలకు ప్రతిస్పందన చూపడాన్ని తెలిపే కొన్ని ఉదాహరణలు చెప్పండి.
7. నువ్వు గ్రీకు శరీరధర్మ శాస్త్రవేత్త గాలన్ అనుకో (క్రీ.పూ. 129-200). నీ దగ్గరకు ఒకరోజు ఒక రోగి వచ్చాడు. అతడు రథం నుంచి కింద పడ్డానని చెప్పాడు. అతడి మెడపై దెబ్బ తగిలితే, తన చేతి స్పర్శ కోల్పోయాడు. ఈ సంఘటనతో నీలో ఎలాంటి ప్రశ్నలు ఉదయించి ఉండవచ్చు?
8. మనం చేసే పనుల్లో స్వయంచోదిత నాడీవ్యవస్థ విధులకు ఒక ఉదాహరణ తెలపండి.
9. పటాన్ని పరిశీలించి కాంతి, నిష్కాంతి చర్యల గురించి మీరేం అర్థం చేసుకున్నారో తెలపండి.
10. అడవులు, వన్యజీవులను ఎందుకు సంరక్షించుకోవాలి?
11. వాయుమార్గంలో తేమ లేనట్లయితే ఏం జరుగుతుంది?
12. విటమిన్ కె లోపం వల్ల ఏమి జరుగుతుంది?
13. కింది పటాన్ని పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) ఈ ప్రయోగం ఏమి తెలియజేస్తుంది? ii) ఏ వాయువు సున్నపుతేటను పాలవలె మార్చుతుంది? iii) మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినప్పుడు మనం బయటకు వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంది? iv) అద్దం పైకి శ్వాస వదిలినప్పుడు నీటి ఆవిరి అద్దంపై ఏర్పడటాన్ని గమనించే ఉంటారు. మనం విడిచే గాలిలోకి నీటి ఆవిరి ఎక్కడ నుంచి వచ్చింది?
14. ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువుల సంఘటనంలో నత్రజనిలో తేడా ఎందుకు ఉండదు?
15. బయో అక్యూమ్యులేషన్/ జైవిక వ్యవస్థాపనం అంటే ఏమిటి?
16. శిశువు లింగ నిర్ధారణకు కారణం మగవారే. దీన్ని అంగీకరిస్తావా? మీ సమాధానాన్ని ఫ్లో చార్టు ద్వారా వివరించండి.
17. ‘మనుగడ కోసం పోరాటం’ అర్థం చేసుకోవడానికి మీ పరిసరాలలోని ఏయే ఉదాహరణలను లేదా ఏయే సందర్భాలను మీరు పరిశీలించారు?
18. వేటి ద్వారా మొక్కలలో వాయు వినిమయం జరుగుతుంది?
19. ఒక్కోసారి ఆహారం శ్వాసనాళంలోకి పోయి ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది?