ప్రస్తుతం నిరుద్యోగులు వేర్వేరు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే వేర్వేరు పరీక్షల్ని రాస్తున్నారు.
చాలావరకు ఉద్యోగాలకు విద్యార్హతలు, సిలబస్ ఒకేలా ఉంటుంది.
కానీ వేర్వేరుగా ఫీజులు చెల్లించి వేర్వేరుగా పరీక్షలు రాస్తున్నారు.
దీని వల్ల డబ్బు, సమయం, శ్రమ వృథా అవుతోంది
మోదీ ప్రభుత్వం దీనికి ఓ పరిష్కారంగా నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వే, ఆర్థిక శాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS నుంచి ప్రతినిధులు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో ఉంటారు
నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ గ్రూప్ బీ, గ్రూప్ సీ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది.
దేశంలోని ప్రతీ జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయి.
దీని వల్ల పరీక్షల కోసం నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఇది బాగా ఉపయోగపడుతుంది
అందరికీ జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లి పరీక్షలు రాయొచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలను పెంపొందించుకోవచ్చు.
ముఖ్యంగా యువతులు, మహిళలు తమకు దగ్గర్లో పరీక్ష కేంద్రాలు ఉంటే ఎగ్జామ్ రాసేందుకు ముందుకొస్తారని, దీని వల్ల మహిళలకు మేలు జరిగినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది
ఇక ప్రస్తుతం వేర్వేరు పరీక్షలకు వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది.
ఫీజులు కూడా రూ.1,000 వరకు ఉంటుంది. దీంతో పేద విద్యార్థులకు ఈ ఎగ్జామ్ ఫీజులే భారంగా మారింది.
రెండు మూడు పరీక్షలకు ఫీజులు చెల్లించాలంటే పేద విద్యార్థులకు చాలా కష్టమే.
పరీక్ష ఫీజు మాత్రమే కాదు… నగరాల్లో జరిగే ఎగ్జామ్స్‌కు ముందు రోజే వెళ్లడం, ప్రయాణ ఖర్చులు, ఎక్కడో చోట బస చేసేందుకు ఖర్చులు ఇలా ఒక్క పరీక్షకు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఖర్చవుతోంది.
మూడు నాలుగు పరీక్షలు రాయాలంటే ఆర్థికంగా భారమే
కానీ ప్రస్తుతం ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడం వల్ల ఈ భారం చాలావరకు తగ్గుతుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET రాయడానికి మీకు నచ్చిన సెంటర్ ఎంచుకోవచ్చు.
మీకు నచ్చిన భాషలో ఎగ్జామ్ రాయొచ్చు
నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ టెన్త్, ఇంటర్, డిగ్రీ లెవెల్స్‌లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది.
ప్రస్తుతం ఈ పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్-RRB, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS నిర్వహిస్తున్నాయి
ఈ సెట్‌లో వచ్చే స్కోర్‌కు మూడేళ్ల వేలిడిటీ ఉంటుంది. అంటే ఆ స్కోర్‌తో ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా దరఖాస్తు చేయొచ్చు.
ఈ స్కోర్ ఆధారంగా స్క్రీనింగ్ ఉంటుంది.
ఆ తర్వాత ఆయా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే టైర్ 2, టైర్ 3 పరీక్షలు రాయాలి.
స్కోర్ పెంచుకోవడానికి ఎన్నిసార్లైనా ఈ టెస్ట్ రాయొచ్చు. ఎక్కువగా వచ్చిన స్కోర్స్‌నే పరిగణలోకి తీసుకుంటారు.
గరిష్ట వయస్సులోపే సెట్ రాయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది