టీచర్లకు హ్యాండ్ బుక్స్, పిల్లలకు బొమ్మల పుస్తకాలు
సిలబస్ రూపొందించిన ఎస్‌సీఈఆర్‌టీ
విద్యారంగంలో సమూల మార్పుల దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది.
దీనికి సంబంధించి సిలబస్, పుస్తకాలను రూపొందించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించనుంది.
ఇటీవల జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చేనాటికి 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని వివిధ అధ్యయనాలు పేర్కొంటున్నందున ఆ దశలోనే వారిలో చదువుకు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
వీటిలో దశలవారీగా ప్రీప్రైమరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రీప్రైమరీ కింద మూడేళ్ల పిల్లలకు పీపీ1, నాలుగేళ్ల పిల్లలకు పీపీ2 ఉంటాయి.
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల సమయాల్లోనే ఈ పీపీ1, పీపీ2 తరగతులు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించింది.
జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన కరిక్యులమ్‌ను అనుసరించి ఈ పీపీ1, పీపీ2 పుస్తకాలు ఉండనున్నాయి.
బోధన, క్లాసులు ఇలా..
⇔ టీచర్లకు హా‍్యండ్‌బుక్‌తో పాటు పిల్లలకు నాలుగేసి బొమ్మల పుస్తకాలను ఎస్‌సీఈఆర్టీ రూపొందించింది.
⇔ 3 సెమిస్టర్లుగా ఇవి ఉంటాయి. జూన్-సెప్టెంబర్, అక్టోబర్-డిసెంబర్, జనవరి-మార్చిగా విభజించి ఆ మేరకు హ్యాండ్‌బుక్‌ను రూపొందించారు. ⇔ పీపీ1, పీపీ2 పిల్లల కోసం వేర్వేరుగా బొమ్మల రూపంలో ఉన్న ఫన్‌బుక్, రైమ్స్ బుక్, స్టోరీ బుక్, వర్క్ బుక్ తయారుచేస్తున్నారు. ⇔ టీచర్లకు ఇచ్చే హ్యాండ్‌బుక్‌లో పాఠ్యాంశాలు పిల్లలకు ఎలా చెప్పాలో సూచనలు ఇస్తారు. ⇔ ఇంగ్లిష్, తెలుగు అక్షరమాల, అంకెలతో పాఠ్యపుస్తకాలు ఉంటాయి. పీపీ1లో పరిచయం చేసిన వాటినే పీపీ2లో కొంచెం వివరంగా చూపిస్తూ నేర్పిస్తారు. ⇔ పదినెలల బోధనా కాలంలో నెలకో అంశాన్ని బోధించేలా పుస్తకాలు రూపొందించారు. ⇔ టీచర్లు ఆ అంశాల గురించి చెబుతున్నపుడు వర్కుబుక్‌లో పిల్లలతో వాటిని గుర్తు పట్టేలా చేస్తారు. ⇔ పీపీ1 పిల్లలకు మౌఖికంగా తరగతులుంటాయి. పీపీ2లో రాతకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవడేలా చేస్తారు. ⇔ ఉదయం 9-15కి తరగతులు ప్రారంభమవుతాయి.
ఒక్కోటి అరగంట సేపు చొప్పున మొత్తం 6 పీరియడ్లుంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, విశ్రాంతికి సమయం ఇస్తారు. ⇔ తరువాత 2 నుంచి 3 వరకు క్లాసులు కొనసాగించి 3.10కి ఇళ్లకు పంపిస్తారు.
ఆటపాటలతో విద్యాబోధన: అరగంట కొక అంశాన్ని ఆటపాటలతో నేర్పించేలా కరిక్యులమ్ ఉంటుంది. ఆయా పీరియడ్లలో ఏం చెప్పాలో ఎన్‌సీఈఆర్‌టీ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించి ఎస్‌సీఈఆర్‌టీ ఈ కరిక్యులమ్‌ను రూపొందించింది.
అంగన్‌వాడీ టీచర్లకు వీటిపై శిక్షణ ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలను యూట్యూబ్‌లో పెట్టి అంగన్‌వాడీ టీచర్లు నేర్చుకొనేలా చేయనున్నారు.– ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి