ఈ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జీరో బ్యాలెన్స్ అకౌంట్.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన… అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇది.
నిరుపేదలకు సైతం బ్యాంకింగ్ సేవల్ని దగ్గర చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
అంతేకాదు ప్రభుత్వ పథకాలకు చెందిన నిధులు, సబ్సిడీలను జన్ ధన్ అకౌంట్ల ద్వారానే ట్రాన్స్ఫర్ చేస్తోంది ప్రభుత్వం.
ప్రస్తుతం పీఎం కిసాన్ స్కీమ్ సాయాన్ని జన్ ధన్ ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం.
ఇప్పటికే 35 కోట్లకు పైగా జన్ ధన్ అకౌంట్లు తీసుకున్నారు.
ఇంకా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నవాళ్లున్నారు.
ఈ అకౌంట్లల్లో డిపాజిట్లు రూ. 1 లక్ష కోట్లు దాటాయని ఓ అంచనా.
అయితే జన్ ధన్ అకౌంట్‌తో వచ్చే లాభాల గురించి అవగాహన లేదు.
అసలు జన్ ధన్ ఖాతా ఎవరెవరు తీసుకోవచ్చు? ఈ అకౌంట్‌తో కలిగే ప్రయోజనాలేంటీ? తెలుసుకోండి.
జన్ ధన్ ఖాతా ఎవరికి? లాభాలేంటీ?
20 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వారెవరైనా జన్ ధన్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ని బ్యాంకులూ జన్ ధన్ అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి.
ఆధార్ కార్డ్ తప్ప ఇతర డాక్యుమెంట్స్ ఏవీ జన్ ధన్ ఖాతాకు అవసరం లేదు.
ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి డాక్యుమెంట్స్‌తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
ఒకవేళ అడ్రస్ మారితే లేటెస్ట్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఏడాదిలో మొత్తంగా రూ.1 లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్ చేయకూడదు.
విత్‌డ్రాయల్స్ ఒక నెలలో రూ.10,000, ఏడాదిలో రూ.50,000 మించకూడదు.
జన్ ధన్ అకౌంట్ వేలిడిటీ ఒక ఏడాది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగిస్తాయి బ్యాంకులు. జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రూపే డెబిట్ కార్డ్ జారీ చేస్తుంది బ్యాంకు.
ఆధార్ లింక్ చేసిన అకౌంట్లకు రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉండేది.
కొంతకాలం క్రితం ఓవర్ డ్రాఫ్ట్ రూ.10,000 చేసింది కేంద్రం.
అంతేకాదు రూపే డెబిట్ కార్డుపై రూ.1 లక్ష యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవర్ ఉండేది. ఇన్స్యూరెన్స్ను రూ.2 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.